గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

ప్రధానాంశాలు

నిండు ప్రాణాలు బలి..అంత్యక్రియలకు వెలి

కరోనా... కరోనా... కరోనా... ఎటుచూసినా భయం భయం... అందరిలోనూ అనుమానపు చూపులు... సరైన సమయానికి వైద్యసేవలు అందక చనిపోతున్న అభాగ్యులు ఒకవైపు...  పరిస్థితి విషమించి మృత్యువాత పడితే అంత్యక్రియలూ సజావుగా సాగని దుస్థితి మరోవైపు. వైరస్‌ మహమ్మారి ధాటికి మానవత్వం కకావికలమై.. మనిషితత్వం చెల్లాచెదురవుతున్న వైనానికి దర్పణాలు... రాష్ట్రంలో ఆదివారం చోటు చేసుకున్న ఈ సంఘటనలు...


పట్టించుకోకపోతే... ఆయువెట్లా నిలిచేది?
వైద్యం అందక మహిళ కన్నుమూత

డోన్‌, డోన్‌పట్టణం, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా డోన్‌ పట్టణంలోని శ్రీరామనగర్‌కు చెందిన ఫాతిమా(49)కు ఆయాసం రావడంతో గురువారం డోన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. కరోనా పరీక్ష చేయించుకోవాలని సిబ్బంది సూచించారు. శుక్రవారం ఫాతిమా, ఆమె భర్త నజీర్‌ పరీక్షలు చేయించుకున్నారు. శనివారం డోన్‌ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చారు. పరిస్థితి విషమించిన ఆమెను కర్నూలుకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్ష ఫలితం వచ్చే దాకా చికిత్స అందించలేమంటూ వైద్యులు పట్టించుకోలేదని బంధువులు వాపోయారు. ఎలాగైనా ప్రాణాలు కాపాడాలని ఆమెను తీసుకుని పలు ప్రైవేట్‌ ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. కరోనా భయంతో ఎవరూ చేర్చుకోలేదు. చివరికి శనివారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. నాలుగు రోజుల పాటు వైద్య సేవలు అందకపోయేసరికి ఫాతిమా ఆదివారం మరణించారు. తీరా ఆమె చనిపోయాక వచ్చిన ఫలితాల్లో నెగెటివ్‌ రావడం గమనార్హం.


ఆ నాలుగు అడుగులూ వేసేలోగా...
అంబులెన్స్‌ ఎక్కేలోపే వృద్ధురాలి మృతి

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: కడప జిల్లా రైల్వేకోడూరులోని శ్రీరాంనగర్‌కు చెందిన ఓ వృద్ధురాలి (72) భర్త గతంలోనే చనిపోయారు. కుమారుడు అమెరికాలో ఉంటున్నారు. కువైట్‌లో నివసిస్తున్న కుమార్తెకు ఇటీవల కరోనా సోకి మరణించారు. ఆమె పెద్ద కర్మను ఇక్కడ నిర్వహించారు. హైదరాబాద్‌, తిరుపతి సహా పలు ప్రాంతాల నుంచి బంధువులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకు వృద్ధురాలికి తీవ్రమైన దగ్గు, జ్వరం, ఆయాసం వచ్చాయి. ఆమెకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. కరోనా పాజిటివ్‌ అని ఆదివారం నివేదికలు అందాయి. ఆమెను కడపకు తీసుకెళ్లేందుకు 108 సిబ్బంది వచ్చారు. వృద్ధురాలి ఇంటి దగ్గరకి వెళ్లే వీధి ఇరుకుగా ఉండటంతో అంబులెన్స్‌ దాకా నడిచిరావాలని వారు కోరారు. ఒక్కో అడుగూ వేసే కొద్దీ ఆమెకు ఆయాసం ఎక్కువైంది. మరో నాలుగు అడుగులు వేస్తే అంబులెన్స్‌ వస్తుందనగా కిందపడిపోయారు. వృద్ధురాలిని పరీక్షించిన సిబ్బంది చనిపోయినట్లు ధ్రువీకరించారు. తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోయేసరికి గంటల తరబడి మృతదేహం అక్కడే ఉండిపోయింది. అమెరికాలోని ఆమె కుమారుడికి సమాచారం అందించామని, ఆయన తన స్నేహితుడిని పంపుతానని చెప్పినట్లు సీఐ ఆనందరావు పేర్కొన్నారు. వారు రాగానే అంత్యక్రియలు చేయిస్తామని సీఐ వివరించారు.


ఖననానికి ఎదురైన ఆటంకాలు
కరోనా అనుమానంతో అడ్డుకున్న గ్రామస్థులు

మదనపల్లె, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీ ఈశ్వరమ్మకాలనీకి చెందిన ఆటోడ్రైవర్‌ (43) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. మదనపల్లెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఊపిరి తీసుకోవడం కష్టంకావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో తిరుపతి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మధ్యలోనే చనిపోయారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా... తమకు అనుమానం ఉందని వైద్యపరీక్షలు చేయించాలని పోలీసులకు, వైద్య సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. బొమ్మనచెరువు వైద్య సిబ్బంది, రూరల్‌ ఎస్సై దిలీప్‌కుమార్‌ అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. వలసపల్లె శ్మశానవాటికలో అంత్యక్రియలు చేసేందుకు అనుమతించారు. అక్కడ ఖననం చేస్తున్నారని తెలుసుకుని సమీపంలోని ఐదు గ్రామాలకు చెందిన కొందరు అడ్డగించారు.  చేసేది లేక మృతదేహాన్ని వాహనంలో మదనపల్లెలోని ఆసుపత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లగా అక్కడి సిబ్బంది స్వాబ్‌ సేకరించారు. ఆ తర్వాత ఈశ్వరమ్మకాలనీ సమీప వంక ప్రాంతంలో అంత్యక్రియలు చేసేందుకు యత్నించగా స్థానికులు మళ్లీ అడ్డుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చివరకు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రూరల్‌ ఎస్సై దిలీప్‌కుమార్‌, ఏఎస్సై నజీర్‌ మదనపల్లె సమీప అటవీప్రాంతంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. జేసీబీ సాయంతో లోతుగా గుంత తవ్వించి మృతదేహాన్ని ఖననం చేయడంతో సమస్య పరిష్కారమైంది. రాత్రి వెలువడిన నివేదికలో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని