గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

ప్రధానాంశాలు

రాజస్థాన్‌లో రాజకీయ తుపాను

గహ్లోత్‌పై సచిన్‌ పైలట్‌ తిరుగుబాటు
తన వర్గం ఎమ్మెల్యేలతో గుర్తుతెలియని చోట మకాం
30 మంది మద్దతుందని ప్రకటన
నేడో రేపో భాజపాలో చేరతారని ప్రచారం

రాజస్థాన్‌లో శాసనసభ స్థానాలు: 200
కాంగ్రెస్‌ బలం: 107 (కనీసం మరో 10 మంది స్వతంత్రుల మద్దతు ఉంది)
భాజపా: 72 (రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీకి చెందిన ముగ్గురి మద్దతు అదనం)

జైపుర్‌, దిల్లీ: రాజస్థాన్‌లో రాజకీయ తుపాను చెలరేగింది. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌పై అదే పార్టీకి చెందిన ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ తిరుగుబావుటా ఎగరేశారు. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను తీసుకుని గుర్తుతెలియని చోట మకాం పెట్టారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ మనుగడ అగమ్యగోచరమయింది. పరిస్థితిని చక్కదిద్దడానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం రంగంలోకి దిగి, ఇద్దరు పరిశీలకుల్ని జైపుర్‌కు పంపింది. మరోవైపు గహ్లోత్‌ సోమవారం సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. దీనికి హాజరయ్యేది లేదని పైలట్‌ ప్రకటించారు. తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పారు. ఆయన నేడో రేపో భాజపాలో చేరే అవకాశం ఉందని వివిధ టీవీ ఛానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి. దీంతో కాంగ్రెస్‌ శిబిరంలో కలవరం మొదలైంది. మధ్యప్రదేశ్‌లో ఇటీవల ఇలాంటి నాటకీయ పరిణామాలే చోటుచేసుకుని కమల్‌నాథ్‌ సర్కారు కూలిపోయి, భాజపా ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. సమీకరణాలు అనుకూలిస్తే ఎడారి రాష్ట్రంలోనూ అలాగే జరగవచ్చనే అంచనాలూ లేకపోలేదు.

గహ్లోత్‌ సమాలోచనలు... బల ప్రదర్శన
గహ్లోత్‌తో విభేదిస్తూ పైలట్‌ తన వర్గీయులతో వేరేచోటుకు వెళ్లిపోవడం, ఫోన్లోనైనా అందుబాటులో లేకపోవడం రాజస్థాన్‌లో కలవరానికి కారణం. కాకలుతీరిన నేత గహ్లోత్‌ ఆదివారం రాత్రి తన నివాసంలో అధికారపక్ష ఎమ్మెల్యేలతో విడిగా సమావేశమై సమాలోచనలు జరిపారు. దాదాపు పది మంది మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు దీనికి హాజరయ్యారు. ఇది ఒక రకంగా బల ప్రదర్శనలా మారింది. అధిష్ఠానం రంగంలో దిగి ఇద్దరు పరిశీలకుల్ని జైపుర్‌కు పంపడంతో పాటు రాజీ సూత్రం కోసం యుద్ధప్రాతిపదికన అన్వేషిస్తోంది. సోమవారం జరగనున్న శాసనసభాపక్ష సమావేశంపైనే ఇప్పుడు అందరి కళ్లూ ఉన్నాయి. రాజస్థాన్‌ పరిణామాలపై పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌ గాంధీ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు పెద్ద రాష్ట్రాలను భాజపాకు ఇలాంటి పరిస్థితుల్లోనే చేజేతులా అప్పగించేశామని, ఇప్పుడు రాజస్థాన్‌లోనూ అలాంటి పరిస్థితి తెస్తున్నారని వారు భావిస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం.

గహ్లోత్‌ సర్కారు మైనారిటీలో ఉంది: సచిన్‌
తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు, మరికొందరు స్వతంత్రుల అండ ఉందని పైలట్‌ చెప్పారు. గహ్లోత్‌ సర్కారు మైనారిటీలో పడిందన్నారు. ఇలా ప్రకటించడం ద్వారా ఆయన బాహాటంగానే తిరుగుబావుటా ఎగరేసినట్లయింది. తన వాట్సప్‌ గ్రూపు ద్వారా ఆయన ఈ ప్రకటన చేశారు. సీఎల్పీకి ఆయన హాజరుకాబోవడం లేదని ప్రకటన స్పష్టం చేసింది.

నోటీసులతో అగ్నికి ఆజ్యం
రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక సీఎం పదవికి గహ్లోత్‌ను అధిష్ఠానం ఎంపిక చేసినప్పటి నుంచి ఆయనకు, పైలట్‌కు మధ్య విభేదాలు పొడసూపాయి. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో శాసనసభ్యుల ప్రలోభాలకు సంబంధించి సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేయడం దీనికి పెద్దఎత్తున ఆజ్యం పోసింది. నోటీసులు రావడాన్ని తీవ్ర అవమానంగా పైలట్‌ భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సొంత ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ఆరోపణలపై ఇలాంటి నోటీసులు రావడమంటే తమ విషయంలో అన్ని లక్ష్మణరేఖల్ని గహ్లోత్‌ దాటేసినట్లేనని పైలట్‌ వర్గీయులు మండిపడుతున్నారు. ఇక గహ్లోత్‌ నాయకత్వం కింద పనిచేయడం తమ వల్ల కాదని వారు తెగేసి చెబుతున్నారు. అయితే నోటీసులు తనతో సహా చాలామందికి వచ్చాయని గహ్లోత్‌ చెబుతున్నారు. అది కంటితుడుపేనని, పైలట్‌ను వేధించడమే అసలు ఉద్దేశమని యువనేత వర్గం విశ్లేషిస్తోంది. పీసీసీ అధ్యక్షునిగా ఉన్న ఒక ఉప ముఖ్యమంత్రికి ఇలా ఎన్నడూ నోటీసులు రాలేదని చెబుతోంది.

కలవరం కలిగిస్తోంది: సిబల్‌
రాజస్థాన్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీకోసం తాను కలవరపడుతున్నానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ ట్వీట్‌ చేశారు. ‘గుర్రపు శాల నుంచి గుర్రాలను తీసుకుపోయిన తర్వాతే మనం మేలుకుంటామా’ అని ప్రశ్నించారు.

సర్కారు స్థిరంగానే ఉంది: ఏఐసీసీ
రాజస్థాన్‌లో ప్రభుత్వం స్థిరంగానే ఉందని, ఎమ్మెల్యేలంతా తనతో సంప్రదింపులు జరుపుతున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఆ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు అవినాశ్‌ పాండే దిల్లీలో పేర్కొన్నారు. పైలట్‌తో మాత్రం రెండ్రోజులుగా మాట్లాడలేదని, ఆయనను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. సోమవారం జరిగే సీఎల్పీ సమావేశానికి ఏఐసీసీ తరఫున వికాస్‌పాండే హాజరుకానున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో జైపుర్‌కు పరిశీలకులుగా పార్టీ సీనియర్‌ నేతలు రణదీప్‌ సూర్జేవాలా, అజయ్‌మకెన్‌లను కాంగ్రెస్‌ అధిష్ఠానం అత్యవసరంగా పంపించింది.

మధ్యప్రదేశ్‌లో భాజపా గూటికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే
భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రద్యుమ్నసింగ్‌ లోఢి భాజపా గూటికి చేరారు. శాసన సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తాజా రాజీనామాతో శాసనసభలో పార్టీ బలం 91కి తగ్గిపోయింది.


పైలట్‌ తదుపరి వ్యూహం?

పైలట్‌ తదుపరి వ్యూహం ఏమిటనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. గురుగ్రాం సమీపంలోని ఒక రిసార్టులో ఆయన తన విధేయులతో కలిసి బస చేసినట్లు కొందరు, దిల్లీలో ఉన్నారని మరికొందరు చెబుతున్నారు. పైలట్‌ భాజపాలో చేరతారని ప్రచారం జరుగుతున్నా... ఆయనకు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేందుకు ఆ పార్టీ సుముఖంగా లేదని సమాచారం. దీంతో ఆయనొక ప్రాంతీయ పార్టీని స్థాపించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తారా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అయితే సచిన్‌తో తాము చర్చలేమీ జరపలేదని భాజపా స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా పైలట్‌ శిబిరంలో ఉన్నట్లు భావిస్తున్న ముగ్గురు శాసనసభ్యులు ఆదివారం రాత్రి తిరిగి జైపుర్‌కు వచ్చి, కాంగ్రెస్‌ పార్టీ ఆదేశాలే తమకు శిరోధార్యమని చెప్పడం విశేషం. ప్రస్తుత మంత్రులందరి చేతా గహ్లోత్‌ రాజీనామాలు చేయించవచ్చని భావిస్తున్నారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని