సోమవారం, జూన్ 01, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

ప్రధానాంశాలు

3 పై మోదీకి

రాజధానుల ఆవశ్యకతను ప్రధానికి వివరించిన ముఖ్యమంత్రి జగన్‌
మండలి రద్దుపై న్యాయశాఖకు ఆదేశాలివ్వాలని వినతి
హైకోర్టు ప్రధాన బెంచ్‌ కర్నూలుకు తరలింపులో సహకరించాలని అభ్యర్థన
ప్రత్యేక హోదాకు వినతి
గంటన్నరకు పైగా ప్రధానితో భేటీ
ఇళ్లపట్టాల పంపిణీకి రాష్ట్రానికి రావాలని ఆహ్వానం
11 వినతి పత్రాల అందజేత!
ఈనాడు - దిల్లీ

రాష్ట్రంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన మూడు రాజధానుల నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ ముందుంచారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను వివరించారు. బుధవారం సాయంత్రం ఆయన ప్రధాని మోదీతో సుమారు గంటన్నరకు పైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమరావతి నుంచి పాలన రాజధానిని విశాఖకు మార్చడం, కర్నూలులో హైకోర్టు ప్రధాన బెంచ్‌ ఏర్పాటు, మండలి రద్దు, ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు... తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకహోదా ప్రకటించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర శాసనమండలి రద్దుకు న్యాయశాఖను ఆదేశించాలని కోరారు.

పాలనా రాజధానిగా విశాఖ...
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి, అసమతుల్యతలను తొలగించి సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానికి జగన్‌ తెలిపారు. పాలన వికేంద్రీకరణ, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ నిమిత్తం ప్రణాళికలు రూపొందించామని వివరించారు. పాలనా రాజధానిగా విశాఖపట్నం, జ్యుడీషియల్‌ రాజధానిగా కర్నూలు, లెజిస్లేటివ్‌ రాజధానిగా అమరావతి ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టం-2020కు శాసనసభ ఆమోద ముద్ర వేసిన విషయాన్ని కూడా ప్రధానికి వివరించారు.

మండలి రద్దుపై... :  గత రెండు నెలల పరిణామాలను పరిశీలిస్తే.. రాష్ట్ర శాసనమండలి ప్రజల మంచి కోసం, మెరుగైన పాలన కోసం ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సింది పోయి అడ్డుపడే ధోరణితో వ్యవహరిస్తోందని ప్రధాని మోదీకి జగన్‌ తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను అడ్డుకొనే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో మూడింట రెండొంతుల మెజారిటీతో శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ సిఫార్సు చేసిందన్నారు. తదనంతర చర్యలు తీసుకోవాలని కేంద్ర న్యాయశాఖకు ఆదేశాలు ఇవ్వాలని జగన్‌ కోరారు.

కర్నూలులో: హైకోర్టు ప్రధాన బెంచ్‌ను కర్నూలుకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు.

ప్రత్యేక హోదాపై...:
రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆర్థిక సంఘం సిఫార్సులు అవసరం లేదని 15వ ఆర్థిక సంఘం చెప్పిన విషయాన్ని ప్రధాని వద్ద జగన్‌ ప్రస్తావించారు. హోదా అనేది కేంద్రం పరిధిలోనిదని, కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చని ఆర్థిక సంఘం చెప్పిందని వివరించారు. ఆర్థిక సంఘం సిఫార్సులు పరిగణనలోకి తీసుకొని, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరారు.

పోలవరం అంచనాలకు  ఆమోదం తెలపండి:
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,549 కోట్లకు ఆమోదం తెలిపి పాలనాపరమైన అనుమతులు ఇవ్వాలని ప్రధానిని జగన్‌ కోరారు. 2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముంపు ప్రాంతాల్లోని కుటుంబాలను తరలించడానికి సహాయ, పునరావాస పనులు సకాలంలో పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో పునరావాసం, పరిహారం కోసమే రూ.33,010 కోట్లు అవసరం అవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ.3320 కోట్లు రావాల్సి ఉందని, ఆ నిధులు విడుదల చేయాలని విన్నవించారు.

రెవెన్యూ లోటు:
ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్రం అంగీకరించిందని, రూ.22948.76కోట్లు రెవెన్యూ లోటుగా కాగ్‌ అంచనా వేసిందని ప్రధానికి తెలిపారు. రాష్ట్రానికి ఇంకా ఇవ్వాల్సిన రూ.18969.26 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు.

గ్రాంట్లు గతంలో కంటే తక్కువ ఇస్తున్నారు:
ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ.10,610 కోట్లు నిధులు మాత్రమే వచ్చాయని, గత ప్రభుత్వ హయాంలోని ఏ ఏడాదితో పోల్చినా ఈ మొత్తం తక్కువేనని చెబుతూ ఆయా వివరాలన్నింటినీ సీఎం జగన్‌ ప్రధాని ముందుంచారు. పెండింగ్‌లో ఉన్న గ్రాంట్లు విడుదల చేయాలని కేంద్ర ఆర్థికశాఖకు ఆదేశించాలని కోరారు. కడప ఉక్కు కర్మాగారం నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకోవాలని, రామాయపట్నం పోర్టుకు నిధులు ఇవ్వాలని అభ్యర్థించారు. కృష్ణా-గోదావరి నదుల అనుసంధానానికి నిధులివ్వాలని కోరారు. రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు కేటాయిస్తే రూ.1000 కోట్లు మాత్రమే విడుదల చేశారని, మిగిలిన నిధులు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

25 లక్షల కుటుంబాలకు ఇళ్లు: నవరత్నాల్లో భాగంగా ఉగాది నాడు రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి రావాలని ప్రధానమంత్రిని జగన్‌ ఆహ్వానించారు.

ఉప్పు భూములు అప్పగించండి: తూర్పుగోదావరి జిల్లాలోని 800 ఎకరాల ఉప్పు భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేలా సంబంధిత మంత్రిత్వశాఖకు ఆదేశాలు ఇవ్వాలని సీఎం జగన్‌ కోరారు. ఆ భూములను ఇళ్ల స్థలాల నిమిత్తం అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.

వెనుకబడిన జిల్లాలు:
రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు ఆరేళ్లలో రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చారని, మూడేళ్ల నుంచి కేటాయింపులు కూడా లేవని జగన్‌ తెలిపారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్‌, కలహండి నమూనాలో నిధులు ఇవ్వాలని కోరారు. ఆ ప్రాంతాల్లో తలసరి రూ.4000 ఇస్తుంటే రాష్ట్రానికి మాత్రం రూ.400 చొప్పున మాత్రమే ఇస్తున్నారని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

దిశ చట్టం: ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం-2019కు ఆమోదం తెలపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం తీసుకొచ్చిన ఈ చట్టంపై అనేకమంది ప్రశంసలు తెలిపారన్నారు. చట్టం ఆమోదం నిమిత్తం కేంద్ర హోంశాఖకు ఆదేశాలు  ఇవ్వాలని కోరారు. భేటీ సందర్భంగా ప్రధానికి ముఖ్యమంత్రి 11 వినతిపత్రాలు అందజేసినట్లు తెలిసింది.


రేపు అమిత్‌షాతో

శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్‌ సమావేశం కానున్నట్లు సమాచారం. బుధవారం సాయంత్రం 4.17 నిమిషాలకు ప్రధాని మోదీ నివాసంలోకి వెళ్లిన జగన్‌ సాయంత్రం ఆరు గంటలకు తిరిగి బయటకు వచ్చారు. భేటీ సందర్భంగా ప్రధానికి శ్రీవేంకటేశ్వరస్వామి ప్రతిమ, పుష్పగుచ్ఛాన్ని సీఎం అందజేశారు. ప్రధానితో సమావేశం ముగిసిన అనంతరం సీఎం జగన్‌ నేరుగా విమానాశ్రయానికి చేరుకొని గన్నవరం బయల్దేరారు. ప్రధానితో సమావేశంలో సీఎం జగన్‌తో పాటు పార్లమెంటరీపార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నట్లు తెలిసింది. లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి, చీఫ్‌విప్‌ భరత్‌, మరికొందరు ఎంపీలు, వైకాపా నాయకులు సీఎం పర్యటనలో ఆయన వెంట ఉన్నారు.


కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)