వెజ్‌ వెరైటీలు

Published : 27/06/2021 15:38 IST
పచ్చిపులుసు... కొత్త రుచుల్లో...!

వంకాయ పచ్చిపులుసు

కావలసినవి
వంకాయ (పెద్దది): ఒకటి, ఉల్లిపాయ: ఒకటి, చింతపండు: నిమ్మకాయంత, పచ్చిమిర్చి: రెండు, బెల్లం తురుము: ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు, మంచినీళ్లు: మూడు కప్పులు, ఉప్పు: రుచికి సరిపడా, ఎండుమిర్చి: రెండు, ఆవాలు: అరటీస్పూను, జీలకర్ర: అరటీస్పూను, మినప్పప్పు: అర టీస్పూను, ఇంగువ: పావుటీస్పూను, కరివేపాకు: 2 రెబ్బలు, నూనె: టీస్పూను
తయారుచేసే విధానం
* పెద్ద వంకాయ తీసుకుని కడిగి ఆరాక నూనె పట్టించాలి. ఇప్పుడు సిమ్‌లో పెట్టి కాల్చాలి. తరవాత దాన్ని బయటకు తీసి నీళ్లు చల్లి పది నిమిషాలు చల్లారనివ్వాలి. వంకాయ పైన ఉండే తోలు తీసేసి, గుజ్జును ఓ గిన్నెలో వేసి బాగా మెత్తగా చేయాలి. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు గుజ్జు వేసి బాగా పిసకాలి. మంచినీళ్లు పోసుకుని బెల్లం తురుము వేసి మరోసారి కలపాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక ఎండుమిర్చి వేసి వేయించి తీసి వాటిని చల్లారాక చిదిమి చింతపండు రసంలో కలపాలి. తరవాత అదే నూనెలో ఇంగువ, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వేసి తాలింపుచేసి అందులో కలపాలి.


నువ్వుల పులుసు

కావలసినవి
నువ్వులు: 3 టేబుల్‌స్పూన్లు, బియ్యం: టేబుల్‌ స్పూను, తాజా కొబ్బరి తురుము: 3 టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: ముప్పావు టీస్పూను, కరివేపాకు: 2 రెబ్బలు, కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను, ఉల్లిపాయ: ఒకటి, బెల్లం తురుము: 2 టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి: నాలుగు, ఆవాలు: అరటీస్పూను, మెంతులు: పావుటీస్పూను, జీలకర్ర: అర టీస్పూను, ఎండుమిర్చి: రెండు, నూనె: టీస్పూను
తయారుచేసే విధానం
* బియ్యం మూడు గంటలపాటు నాననివ్వాలి. తరవాత నానిన బియ్యం, నువ్వులు, కొబ్బరితురుములకి కొన్ని నీళ్లు జోడించి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరవాత ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కాస్త వేగాక, మెత్తగా రుబ్బిన నువ్వులు-కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి. తరవాత సరిపడా నీళ్లు పోసి మరిగించాలి. చివరగా చింతపండు గుజ్జు, బెల్లం తురుము వేసి మరికాసేపు మరిగించి కొత్తిమీర తురుము చల్లి దించాలి. చల్లారిన తరవాత తింటే ఇది ఎంతో రుచిగా ఉంటుంది.


మామిడి పచ్చిపులుసు

కావలసినవి
చింతపండు రసం: కప్పు, మామిడికాయ ముక్కలు: కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, నువ్వులు: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా, పంచదార లేదా బెల్లం తురుము: టేబుల్‌స్పూను, ఉల్లిపాయలు: ఒకటి, ఆవాలు: టీస్పూను, జీలకర్ర: అర టీస్పూను, ఎండుమిర్చి: రెండు, పసుపు: టీస్పూను, కరివేపాకు: రెండు రెబ్బలు, నూనె: 2 టీస్పూన్లు
తయారుచేసే విధానం
* చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే మామిడికాయ ముక్కలు వేసి బాగా నలిపినట్లుగా చేస్తూ కలపాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి వేయించి చల్లారనివ్వాలి. తరవాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా తరగాలి. ఈ రెండింటినీ బాగా నలిపినట్లుగా కలిపి చింతపండు రసంలో వేయాలి. ఉప్పు, బెల్లంతురుము లేదా పంచదార కూడా వేసి కలపాలి. చల్లారిన తరవాత తాలింపులోని ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ నలిపి చింతపండు రసంలో కలిపితే పచ్చిపులుసు రెడీ.


పల్లీ పచ్చిపులుసు

కావలసినవి
పల్లీలు: కప్పు, నువ్వులు: పావుకప్పు, పచ్చిమిర్చి: ఆరు, ఉల్లిపాయ: ఒకటి, చింతపండురసం: 2 టీస్పూన్లు, పసుపు: అర టీస్పూను, కారం: అర టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: టీస్పూను, జీలకర్ర: ముప్పావుటీస్పూను, ఆవాలు: ముప్పావు టీస్పూను, కరివేపాకు: 2 రెబ్బలు, కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను
తయారుచేసే విధానం
* బాణలిలో పల్లీలు వేసి వేయించి తీసి చల్లారాక పొట్టు తీసి పక్కన ఉంచాలి. అదే బాణలిలో నువ్వులు కూడా వేసి ఓ నిమిషం వేయించి తీయాలి. ఇప్పుడు రెండూ కలిపి మిక్సీలో వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి. అందులోనే చింతపండు రసం, పసుపు, కారం, ఉప్పు వేసి ఓసారి తిప్పి తీయాలి.
* ఈ పులుసుని ఓ గిన్నెలో వేసి అందులోనే కొత్తిమీర తురుము వేసి కలపాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేగాక ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి తురుము కూడా వేసి వేయించి పచ్చిపులుసు కలిపి వడ్డించాలి.

(28 ఏప్రిల్‌ 2019)

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని