వెజ్‌ వెరైటీలు

Published : 27/06/2021 16:01 IST
పచ్చిమామిడి చవులూరించేలా..!

మామిడికాయ తియ్యకూర

కావలసినవి
పచ్చిమామిడికాయలు: రెండు (చిన్నవి), జీలకర్ర: టీస్పూను, మెంతులు: టీస్పూను, ఉల్లిగింజలు: టీస్పూను, పలావు ఆకులు: రెండు, ఇంగువ:  పావుటీస్పూను, సెనగపిండి: 2 టేబుల్‌స్పూన్లు, పసుపు: అరటీస్పూను, కారం: టీస్పూను, దనియాలపొడి: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, బెల్లంతురుము: టేబుల్‌స్పూను, కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను, నూనె: టేబుల్‌స్పూను

తయారుచేసే విధానం
* పచ్చిమామిడికాయల్ని తొక్కతో సహా చిన్న ముక్కలుగా కోయాలి.
* నాన్‌స్టిక్‌ పాన్‌లో నూనె వేసి కాగాక జీలకర్ర, మెంతులు, ఉల్లిగింజలు వేసి వేయించాలి. తరవాత పలావు ఆకుల ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఇంగువ, సెనగపిండి, పసుపు, కారం, దనియాలపొడి వేసి బాగా కలపాలి. తరవాత పచ్చిమామిడికాయల ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి రెండుమూడు నిమిషాలు ఉడికించాలి. తరవాత ఉప్పు వేసి సిమ్‌లో మరో పది నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు బెల్లం తురుము కూడా వేసి పూర్తిగా కరిగేవరకూ ఉడికించి దించేముందు కొత్తిమీర తురుము వేయాలి. ఇది చపాతీ, రొట్టెల్లోకి బాగుంటుంది.

మ్యాంగో చికెన్‌

కావలసినవి
చికెన్‌: అరకిలో, మామిడికాయ: ఒకటి, ఎండుమిర్చి: నాలుగు, ఉల్లిపాయ: ఒకటి, పసుపు: టీస్పూను, కారం: 2 టేబుల్‌స్పూన్లు, జీలకర్రపొడి: టీస్పూను, దనియాలపొడి: టీస్పూను, గరంమసాలా: టేబుల్‌స్పూను, నూనె: 3 టేబుల్‌స్పూన్లు,  కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను

తయారుచేసే విధానం
* మామిడికాయతొక్కు తీసి ముక్కలుగా కోయాలి. సగం ముక్కల్ని మెత్తని పేస్టులా రుబ్బాలి. ఈ ముద్దలో ఉప్పు, పసుపు, కారం, జీలకర్రపొడి, దనియాలపొడి, టేబుల్‌స్పూను నూనె వేసి చికెన్‌ముక్కలకు పట్టించి మూడుగంటలపాటు నాననివ్వాలి.
* నాన్‌స్టిక్‌ పాన్‌లో మిగిలిన నూనె వేసి కాగాక ఎండుమిర్చి ముక్కలు, ఉల్లిముక్కలు వేసి వేగాక మిగిలిన మామిడికాయ ముక్కలువేసి రెండునిమిషాలు వేయించాలి. తరవాత అల్లంవెల్లుల్లి వేసి వేగాక నానబెట్టిన చికెన్‌ముక్కలు వేసి అరకప్పు నీళ్లు పోసి సిమ్‌లో ఉడికించాలి. చివరగా కొత్తిమీర తురుము చల్లి దించాలి.

మామిడికాయ-కొబ్బరిపాల కూర

కావలసినవి
మామిడికాయ తురుము: కప్పు, ఉల్లిపాయ ముక్కలు: అరకప్పు, అల్లం-పచ్చిమిర్చి ముద్ద: 2 టీస్పూన్లు, దనియాలపొడి: 2 టీస్పూన్లు, కరివేపాకు: 2 కట్టలు, ఉప్పు: రుచికి సరిపడా, పసుపు: అరటీస్పూను, కారం: టీస్పూను, కొబ్బరిపాలు: 2 కప్పులు, ఆవాలు: అరటీస్పూను,
జీలకర్ర: అరటీస్పూను, మెంతులు: అరటీస్పూను, కరివేపాకు: రెండు రెబ్బలు, ఎండుమిర్చి: రెండు, నూనె: 3 టీస్పూన్లు

తయారుచేసే విధానం
* బాణలిలో రెండు టీస్పూన్ల నూనె వేసి కాగాక ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముద్ద, కరివేపాకు వేసి వేయించాలి. తరవాత మామిడికాయ తురుము, పసుపు, కారం, దనియాలపొడి వేసి వేగాక కప్పు కొబ్బరిపాలు పోసి మూతపెట్టి ఉడికించాలి. తరవాత మిగిలిన కొబ్బరిపాలు కూడా పోసి సిమ్‌లో దగ్గరగా అయ్యేవరకూ ఉడికించాలి. విడిగా చిన్న బాణలిలో నూనె వేసి ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, జీలకర్రతో పోపు వేసి కూరలో కలిపి దించాలి.

మామిడికాయ రసం

కావలసినవి
మామిడికాయ: ఒకటి, టొమాటోలు: రెండు, కందిపప్పు: టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత, కరివేపాకు: 4 రెబ్బలు, ఎండుమిర్చి: ఒకటి, మిరియాలు: టీస్పూను, దనియాలు: అరటీస్పూను, వెల్లుల్లి: రెండు రెబ్బలు, అల్లంతురుము: టీస్పూను, ఆవాలు: పావుటీస్పూను, పసుపు: టీస్పూను, నూనె: టీస్పూను

తయారుచేసే విధానం
* మిరియాలు, దనియాలు, జీలకర్ర వేయించి పొడి చేయాలి.
* మామిడికాయల్ని ఉడికించి గుజ్జు తీయాలి. కందిపప్పుని విడిగా వేయించి పొడి చేయాలి.
* టొమాటోల్ని ఉడికించి మెత్తగా చేయాలి. అందులోనే మరికొన్ని నీళ్లు పోసి, మామిడికాయ గుజ్జు వేసి కలపాలి. సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి తురుము వేసి కలపాలి. తరవాత కందిపప్పు పొడి కూడా వేసి కలపాలి.
* బాణలిలో నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి తాలింపు చేసి రసంలో కలిపితే సరి.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని