వెజ్‌ వెరైటీలు

Updated : 16/05/2021 01:13 IST
ఆహారమే... ఔషధం!

పోషకాలు పంచే పసిడి పాలు... ఆరోగ్యాన్నిచ్చే  చిరుధాన్యాల లడ్డూ... ఇన్‌స్టెంట్‌గా తయారై, ఇమ్యూనిటీ¨నిచ్చే దోశ... రుచినిస్తూనే ఆరోగ్యసిరిని అందించే ఉసిరి కొబ్బరి చట్నీ.. ఈ కష్టకాలంలో ఇష్టంగా తయారుచేసుకుని తినేయండి మరి.

గోల్డెన్‌ మిల్క్‌

కావాల్సినవి: పాలు- 300 ఎం.ఎల్‌., మిరియాలు-అర చెంచా, యాలకులు- రెండు, అల్లం ముక్క- చిన్నది, దాల్చిన చెక్క పొడి- పావు చెంచా, నెయ్యి-పావు చెంచా, తేనె-చెంచా.        
తయారీ: పొయ్యి వెలిగించి గిన్నెలో పాలు పోసి వేడి చేయాలి. దీంట్లో పచ్చి పసుపు (సేంద్రియ పసుపు), మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క పొడి జత చేయాలి. చిన్నపాటి అల్లంముక్కను సన్నగా తురిమి వేయాలి. చివరగా నెయ్యి వేయాలి. ఇవన్నీ పాలలో బాగా కలిసేలా అయిదు నిమిషాలపాటు చిన్నమంటపై మరిగించాలి. ఇప్పుడు ఈ పాలను గ్లాసులోకి వడకట్టుకోవాలి. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ పసుపు పాలను తరచూ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఉసిరి కొబ్బరి చట్నీ

కావాల్సినవి: ఉసిరి తురుము- రెండు చెంచాలు, పచ్చికొబ్బరి తురుము- అర కప్పు,  పుట్నాల పప్పు- రెండు చెంచాలు, ఎండుమిర్చి- మూడు, ఆవాలు- పావు చెంచా, కరివేపాకు- రెమ్మ, ఇంగువ- చిటికెడు, కారం- చెంచా, బెల్లంపొడి- చెంచా, హిమాలయన్‌ పింక్‌ సాల్ట్‌- రుచికి సరిపడా, నీళ్లు-తగినన్ని, నూనె- రెండు చెంచాలు.
తయారీ: ఉసిరి, కొబ్బరితురుములు; పుట్నాల పప్పు, కారం, హిమాలయన్‌ సాల్ట్‌, కరివేపాకు, బెల్లంపొడి, తగినన్ని నీళ్లు పోసి మిక్సీలో వేసి ముద్దలా చేసుకోవాలి. పొయ్యి వెలిగించి కడాయి పెట్టి నూనె పోయాలి. అది వేడయ్యాక ఆవాలు, ఇంగువ, కరివేపాకు, ఎండు మిర్చీ వేయాలి. ఈ పోపును పచ్చడిలో వేస్తే రుచికరమైన ఉసిరి కొబ్బరి పచ్చడి సిద్ధం. దీన్ని ఇడ్లీలు, దోశల్లోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. 

క్యారెట్‌ ఆరెంజ్‌ జింజర్‌ స్మూథీ

కావాల్సినవి: కమలాపండు-ఒకటి, క్యారెట్‌- ఒకటి, అల్లం, పసుపు కొమ్ము- చిన్న ముక్క చొప్పున, ఖర్జూరం- ఒకటి, కొబ్బరినూనె- రెండు చెంచాలు, గుమ్మడి విత్తనాలు- పెద్దచెంచా, మామిడిపండు గుజ్జు- ముప్పావు కప్పు, పాలు- కప్పు, (ఆవు, బాదం ఏవైనా)
తయారీ:  పదార్థాలన్నింటినీ బ్లెడర్‌లో వేసి మెత్తగా చేసుకోవాలి. ఈ ద్రవాన్నీ గ్లాసులోకి వడబోసుకుని గుమ్మడి విత్తనాలతో గార్నిష్‌ చేసుకుంటే సరి. పోషకాలతో కూడిన జ్యూస్‌ రెడీ!

ఇమ్యూనిటీ లడ్డూ

కావాల్సినవి: గుమ్మడి గింజలు- కప్పు, నువ్వులు, బెల్లం- రెండు చెంచాల చొప్పున, యాలకుల పొడి- అర చెంచా, నెయ్యి- రెండు చెంచాలు.
తయారీ:  పొయ్యి వెలిగించి బాండీ పెట్టాలి. ఇందులో    నెయ్యి వేసి వేడయ్యాక బెల్లం వేసి కరిగించాలి. ఈలోపు మిక్సీలో గుమ్మడి గింజలను వేసి పొడిలా చేసుకోవాలి. ఇప్పుడొక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లో  గుమ్మడి గింజల పొడి, బెల్లం పాకం, యాలకుల పొడి, నువ్వులు వేసి బాగా కలిపి లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే టేస్టీగా ఉండే ఆరోగ్యాన్నిచ్చే లడ్డూలు రెడీ.

ఇన్‌స్టెంట్‌ మిల్లెట్‌ దోశ

కావాల్సినవి: మిక్స్‌డ్‌ మిల్లెట్‌ రవ్వ- కప్పు (రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, ఊదలు, మక్కలన్నీ కలిపిన రవ్వ మార్కెట్‌లో కూడా దొరుకుతుంది.), మినప్పప్పు- కప్పు, మెంతులు- పావు చెంచా, హిమాలయన్‌ ఉప్పు- రుచికి సరిపడా,  నూనె- తగినంత.
తయారీ: మిక్స్‌డ్‌ మిల్లెట్‌ రవ్వను  రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం మిక్సీలోకి వేసుకోవాలి. ఇందులోనే నానబెట్టుకున్న మినప్పప్పు, మెంతులు, తగినంత ఉప్పు చేర్చి గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకోవాలి. పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టాలి. అది వేడయ్యాక ఈ పిండితో దోశలు వేసుకోవాలి. రెండువైపులా చక్కగా కాల్చుకోవాలి. వీటిని అల్లం, కొబ్బరి చట్నీలతో తింటే చాలా బాగుంటాయి.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని