వెజ్‌ వెరైటీలు

Published : 27/06/2021 15:35 IST
కమ్మకమ్మని పెరుగు కూరలు

వేసవికాలం వేపుళ్లు తినాలంటే ముద్ద దిగడం కష్టమే. అది కాస్త జారుగా ఉంటే హాయిగా ఉంటుంది. అదీ పెరుగుతో చేస్తే ఆరోగ్యానికీ మంచిదే. అందుకే మరి చేసి చూడండి..!


ఆలూ-పెరుగు

కావలసినవి
బంగాళాదుంపలు (ఉడికించినవి): నాలుగు, పెరుగు: 2 కప్పులు, టొమాటో: ఒకటి, ఉల్లిపాయ: ఒకటి, వెల్లుల్లి: రెండు, అల్లం: చిన్నముక్క, మజ్జిగ: 2 కప్పులు, ఉప్పు: తగినంత, జీలకర్ర: టీస్పూను, పసుపు: అర టీస్పూను, కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను, కారం: టీస్పూను, పచ్చిమిర్చి: నాలుగు, నూనె: 2 టీస్పూన్లు
తయారుచేసే విధానం
* బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసి మెత్తగా మెదపాలి. అందులో పెరుగు, ఉప్పు వేసి కలిపి కాసేపు పక్కన ఉంచాలి.
* టొమాటో, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి అన్నీ కలిపి మెత్తగా రుబ్బాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక జీలకర్ర వేసి వేగాక, టొమాటో మిశ్రమం కూడా వేసి వేయించాలి. తరవాత పసుపు వేసి పెరుగు కలిపిన బంగాళాదుంప మిశ్రమం వేసి కలపాలి. ఇప్పుడు మజ్జిగ పోసి, కారం వేసి సిమ్‌లో కూర మొత్తం సగమయ్యేవరకూ సుమారు పది నిమిషాలు మరిగించాలి. చివరగా కొత్తిమీర తురుము చల్లి దించాలి.


పెరుగు కడి

కావలసినవి
పెరుగు: 3 కప్పులు, నెయ్యి: 3 టేబుల్‌స్పూన్లు, కరివేపాకు: 10 రెబ్బలు, కొత్తిమీర తురుము: కొద్దిగా, జీలకర్ర: 2 టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి: ఆరు, ఉప్పు: తగినంత, కొబ్బరి తురుము: 2 కప్పులు
తయారుచేసే విధానం
* మందపాటి బాణలిలో ఒకటిన్నర టేబుల్‌స్పూన్ల జీలకర్ర వేసి వేయించి తీయాలి.
* మిక్సీలో కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, వేయించిన జీలకర్ర వేసి మెత్తగా రుబ్బాలి.
* పెరుగులో కప్పు నీళ్లు పోసి గడ్డల్లేకుండా బాగా గిలకొట్టి మందపాటి బాణలిలో పోయాలి. అందులోనే కొబ్బరి మిశ్రమాన్ని వేసి మీడియం మంట మీద మధ్యమధ్యలో తిప్పుతూ అడుగంటకుండా కాస్తూ, మరుగు వస్తుందనగా స్టవ్‌ కట్టేయాలి.
* విడిగా బాణలిలో నెయ్యి వేసి ఎండుమిర్చి, మిగిలిన జీలకర్ర, కరివేపాకులతో పోపు చేసి కడిలో కలిపి కొత్తిమీర తురుము చల్లాలి.


బీట్‌రూట్‌ పెరుగు కూర

కావలసినవి
బీట్‌రూట్‌(మీడియం సైజువి): రెండు, పసుపు: అరటీస్పూను, పెరుగు: కప్పు, కొబ్బరి తురుము: అరకప్పు, ఆవాలు: అర టీస్పూను, జీలకర్ర: టీస్పూను, పచ్చిమిర్చి: నాలుగు, తాలింపుకోసం: ఆవాలు: అర టీస్పూను, కరివేపాకు: 2 రెబ్బలు, వెల్లుల్లి: రెండు రెబ్బలు, ఎండుమిర్చి: ఒకటి, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: 2 టేబుల్‌స్పూన్లు
తయారుచేసే విధానం
* బీట్‌రూట్‌ కడిగి తొక్కు తీసి సన్నగా తురమాలి.
* తరవాత మిక్సీలో వేసి కొబ్బరితురుము, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి.
* ఇప్పుడు నాన్‌స్టిక్‌పాన్‌లో తురిమిన బీట్‌రూట్‌ వేసి ఉప్పు వేసి పది నిమిషాలు ఉడికించాలి. తరవాత రుబ్బిన కొబ్బరిమిశ్రమం కూడా వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించి దించాక బాగా గిలకొట్టిన పెరుగు అందులో వేసి కలపాలి.
* చిన్నబాణలిలో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి,ఎండుమిర్చి వేసి పోపు పట్టి ఉడికించిన బీట్‌రూట్‌ కూరలో కలపాలి.


పాలక్‌ పెరుగు కర్రీ

కావలసినవి
పాలకూర కట్ట(పెద్దది): ఒకటి, వేరుసెనగగుళ్లు: 2 టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి: రెండు, పసుపు: అరటీస్పూను, అల్లం తురుము: టీస్పూను, వెల్లుల్లిరెబ్బలు: రెండు, కొబ్బరితురుము: అరకప్పు, జీలకర్ర: పావుటీస్పూను, పెరుగు: కప్పు, బియ్యప్పిండి: 2 టీస్పూన్లు, సెనగపిండి: టీస్పూను, పంచదార: అరటీస్పూను, ఉప్పు: కొద్దిగా, తాలింపుకోసం: ఆవాలు: టీస్పూను, మెంతులు: పావుటీస్పూను, ఎండుమిర్చి: ఒకటి, నూనె: టేబుల్‌స్పూను
తయారుచేసే విధానం
* పల్లీలు ముందుగా నానబెట్టాలి. తరవాత వాటిని ఓ రెండు నిమిషాలు ఉడికించాలి.
* పాలకూర శుభ్రంగా కడిగి, వేడినీళ్లలో వేసి తీయాలి. తరవాత చల్లని నీళ్లతో కడిగి మిక్సీలో వేయాలి. అందులోనే ఉడికించిన పల్లీలు కూడా వేసి కచ్చాపచ్చాగా రుబ్బి నాన్‌స్టిక్‌ పాన్‌లో వేయాలి.
* కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బి, పాలకూర మిశ్రమంలో కలపాలి. సెనగపిండి, బియ్యప్పిండి కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. ఉప్పు, పసుపు కూడా వేసి మిశ్రమాన్ని మరిగించాలి.
* అది బాగా ఉడికిన తరవాత సిమ్‌లో పెట్టి గిలకొట్టిన పెరుగు వేసి ఓ నిమిషం మరిగించాలి. విడిగా బాణలిలో తాలింపు చేసి కూరలో కలిపి దించితే సరి.

(5 మే 2019)

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని